

Mana News, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ‘ఈగల్’ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి.. ‘ఈగల్’కు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు.”11వేల ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించాం. రాష్ట్రవ్యాప్తంగా 7 మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్‌స్పాట్‌లను గుర్తించి సాగు లేకుండా చేశాం. గంజాయి సాగుకు అలవాటుపడిన కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించాం. అలా 359 కుటుంబాలు ఇప్పుడు గంజాయికి బదులు ఇతర పంటలను పండిస్తున్నారు. ఏపీలో గంజాయి సాగు కన్నా రవాణా ఎక్కువగా జరుగుతోంది. హోం శాఖ, ఈగల్ ఆధ్వర్యంలో అంతర్గత సమన్వయ సమావేశం కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటు చేశాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీలను ఏర్పాటు చేశాం. గంజాయి సమాచారం అందిన వెంటనే టీచర్లు, ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో డీఎడిక్షన్ సెంటర్లలో చేర్పించే ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏపీలో 44 డీఎడిక్షన్ సెంటర్లు ఉన్నాయి” అని మంత్రి వివరించారు.