

Mana News :- ఏపీలో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేబినెట్ లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఖాళీల భర్తీపై సీఎం చంద్రబాబు సంతకాలు కూడా చేశారు.అయినా ఇప్పటివరకూ ఆ హామీ అమలు కాలేదు. దీంతో అభ్యర్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరికి ఇవాళ మరోసారి విద్యామంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా కీలక హామీ ఇచ్చారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , రేగం మత్స్యలింగం, బి.విరూపాక్షి పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో లోకేష్ ఈ ప్రకటన చేశారు.