

మనన్యూస్,గొల్లప్రోలు:నిల్వమాంసం,చనిపోయిన కోళ్ల మాంసం వ్యాపారులు యదేచ్చగా విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో మృతి చెందిన కోళ్లను స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారు.చనిపోయిన గొర్రెలు,మేకలను మాంసంగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.అలాగే రోజుల తరబడి ఐస్ బాక్సులలో నిల్వచేసిన చేపలను సైతం అమ్ముతున్నారన్నారు.నిల్వ మాంసం,చేపల కారణంగా పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు.పశు వైద్యాధికారి పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరించిన మేకలు గొర్రెలను మాత్రమే మాంసంగా విక్రయించవలసి ఉందని అయితే కొంతమంది వ్యాపారులు నగర పంచాయతీకి సంబంధించిన స్టాంపులు తామే తయారు చేయించుకుని మేకలపై వారే ముద్రిస్తున్నారన్నారు.అధికారులు ఇకనైనా స్పందించి నిల్వ మాంసం,చేపల విక్రయాలను నిరోధించాలని సుబ్బారావు కోరారు.