

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన వారు వ్యక్తపరచలేరు కాబట్టి వారికి వైద్యం అందించడం కత్తి మీద సాము వంటిదని, అటువంటి చిన్న పిల్లల వైద్య వృత్తిని భార్యాభర్తలిద్దరూ ఎంచుకొని ఏలేశ్వరంలో ఆసుపత్రి ప్రారంభించడం శుభపరిణామమని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆదివారం నాడు స్థానిక షిర్డీ నగర్ లో నూతన ఆసుపత్రి “ఉదయ్ కాంత్ చిల్డ్రన్స్ క్లినిక్”ను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా, జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ప్రత్తిపాడు సీనియర్ టీడీపీ నాయకులు,ఉత్తర కంచి సర్పంచ్ మంతిన వెంకరమణ సోదరుని కుమార్తె డాక్టర్ ఆదిలక్ష్మి, అల్లుడు డాక్టర్ ఉదయ్ కాంత్ లకు చెందిన ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుక కావడంతో నియోజకవర్గంనకు చెందిన ఎన్.డి.ఏ కూటమి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతము నుండి ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకులు అవ్వడం అత్యంత ఆనందాయకం అన్నారు.మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని, పలువురు మన్ననలు పొందే విధంగా పనిచేయాలని ఆమె అన్నారు. ఈ ప్రాంతంలో చిన్నారులకి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.