

ఐరాల మన న్యూస్ జనవరి-31
చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్ది గ్రామానికి తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పూర్వీకులు రెండు చెరువులను నిర్మించారు. ఈ రెండు చెరువులు నిండి ఐదు సంవత్సరాలు అవుతుంది. వర్షాలు సక్రమంగా పడకపోవడం, సప్లై చానెల్స్ పూడిపోవడంతో చెరువులు నిండడం గగనంగా మారింది. చెరువులో నిండకపోవడంతో చెరువుల కింద పంటలు పండడం కష్టంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వెయ్యి అడుగులు బోర్లు వేసినా నీళ్లు పడక ఎందరో రైతులు నష్టపోయారు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామస్తులు ఒకచోట సమావేశమై తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగితే ఉపయోగము ఉండదని భావించారు. 20 సంవత్సరాల కిందట తవణంపల్లి మండలం, పట్రపల్లి సమీపంలో నుండి మేడిపంక సప్లై ఛానల్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఈ సప్లై ఛానల్‌ను నిర్మించిన ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం అందజేయడాన్ని విస్మరించింది.
నష్టపరిహారం కోసం రైతులు పట్టుపట్టడంతో ఈ ఛానల్ నిర్వహణలో ఇరిగేషన్ అధికారులు గాలికి వదిలేశారు. కాల్వ పూడిపోయి, అక్కడి నుంచి చెరువులకు నీళ్లు రావడం ఆగిపోయింది. చాలా చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఏపుగా ముళ్ళ పొదలు పెరిగాయి. వీటిని తొలగించి సప్లై ఛానల్‌లో పూడిక తీయాలని, బహుదా నది నీటిని తీసుకురావాలని గ్రామస్తులు నిర్ణయించారు. పుత్రమద్ది గ్రామస్తులకు తోడు బలిజపల్లి, మిట్టూరు, గురవనంపల్లి, వెంగంపల్లి రైతాంగం కూడా కలిసింది. తవణంపల్లి మండలంలోని బహుదా నది నుంచి మేడి వంక సప్లై ఛానల్‌లో పూడిక తీయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను చందాల రూపంలో స్వచ్ఛందంగా పోగు చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో చెరువుల్లోని చేపల అమ్మకం ద్వారా వచ్చిన కొంత మొత్తం నిధులు ఉన్నాయి. వాటికీ తోడు గ్రామాల్లోని మేటి రైతులు కొంత పెద్ద మొత్తాలలో చందాలను అందజేశారు. కాలువలో పూడిక తీయడం కార్యక్రమం ప్రారంభమైంది.
సుమారు రెండు నెలల పాటు హిటాచీలను ఉపయోగించారు. ముళ్ళ పొదలు తొలగిస్తూ, పూడిక తీస్తూ తొమ్మిది కిలోమీటర్లు సప్లై ఛానల్‌ను సిద్ధం చేశారు. మధ్యలో మూడు కల్వర్టులను నిర్మించారు. పుత్రమద్ది గ్రామంలోని రైతులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పనులను ముందుండి పర్యవేక్షించారు. యువకులు దగ్గరుండి పనులు చేయించారు. ఎట్టకేలకు సప్లై ఛానల్ పునరుద్ధరించారు. సరకల్లు వద్ద బహుదా నది నీటిని మేడివంక సప్లై ఛానల్‌కు మళ్లించారు. మళ్లించిన నీటిని ఇతర గ్రామస్తులు వారి గ్రామాలకు మళ్లించకుండా జట్లు జట్లుగా గ్రామస్తులు కాపు కాశారు. దీంతో ఉప్పొంక చెరువు, కొత్తచెరువు, మద్దిమాను చెరువు, వెంగంపల్లిలోని ఎగువ, దిగువ చెరువులు, గురవణంపల్లిలోని జింకలవాని చెరువు నిండుకుంటూ పుత్రమద్ది గ్రామానికి ఈ నీళ్లు చేరాయి. పుత్రమద్ది గ్రామంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వీర రాఘవుల చెరువు నిండి మరవ పోయింది. ఆ నీళ్ళు మరో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కారియన్ రెడ్డి చెరువుకు చేరాయి. వారం రోజుల్లో ఈ చెరువు కూడా నిండి మొరవ పోయింది.
దీంతో పుత్రమద్ది గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. చెరువుల వద్ద మేకపోతులను బలి ఇచ్చి పండుగ చేసుకున్నారు. గంగమ్మతల్లికి పూజలు చేశారు. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. ఐదు సంవత్సరాలు తర్వాత ఈ చెరువులు నిండడంతో క్రమంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గ్రామంలో తాగునీటి సమస్య కూడా తీరింది. ప్రతిరోజు ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పుత్రమద్ది చెరువులు నిండిన తర్వాత బలిజపల్లెలోని చిన్న రాముని చెరువు, కామినాయుని పల్లి చెరువులు నింపుతున్నారు. ఇలా పుత్రమద్ది లోని ఆదర్శ రైతులు జిల్లాలోని రైతాంగానికి మకుటాయమానంగా నిలిచారు. తమ సమస్యను తామే పరిష్కరించుకొని సహబాష్ అనిపించుకున్నారు. పుత్రమద్ది గ్రామస్తుల స్పూర్తితో మరిన్ని గ్రామాల రైతులు ముందుకు రావాలని ఆశిద్దాం.