

MANA NEWS :- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. తాను అధికారంలోకి వస్తే.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పలుసార్లు ప్రస్తావించారు. అయితే, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఏ విధంగా ఆపుతారనే విషయాన్ని ట్రంప్ చెప్పలేదు. తాజాగా.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం తరువాత ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది.గురువారం ప్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి వ్లాదిమిర్ పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ – రష్యా మధ్య వార్ గురించి పుతిన్ తో ట్రంప్ చర్చించారు. యుక్రెన్ యుద్ధాన్ని విస్తరించొద్దని సూచించినట్లు తెలిసింది. ఐరాపోలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. యుక్రెన్ యుద్ధం పై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ సూచించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో పుతిన్ కు ట్రంప్ వార్నింగ్ సైతం ఇచ్చాడని తెలుస్తోంది.ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నకు ఇటీవల పుతిన్ అభినందనలు తెలిపారు. ట్రంప్ తో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే.. ఈ ఏడాది జూన్ 14న పుతిన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్ పై యుద్ధాన్ని నిలిపివేయాలంటే పలు నిబంధనలు విధించాడు. అందులో ప్రధానమైనవి.. యుక్రెయిన్ NATO లో చేరకూడదు. రష్యా క్లెయిమ్ చేసిన నాలుగు ప్రాంతాల భూభాగం నుంచి యుక్రెయిన్ దళాలన్నింటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే, యుక్రెయిన్ దానిని తిరస్కరించింది. అలా చేస్తే మేము రష్యా ముందు లొంగిపోవడంతో సమానమని పేర్కొన్న విషయం తెలిసిందే.