

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ సందర్భంగా అమరావతికి 15వేల కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సహకారంతో ఏపీకి అందించనుంది.
ఈ క్రమంలో 15వేల కోట్లను ఎలా వినియోగిస్తామన్న దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా రూ.15వేల కోట్ల రుణ సహకారం అందిస్తాయన్న ప్రభుత్వం.. ఈ నిధులను ఉపయోగించి అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అమరావతికి వరద ముప్పు రాకుండా ఉండేలా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, రోడ్లు, డక్ట్ లు, అలాగే డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులు చేపట్టాలని సూచించింది.
మరోవైపు అమరావతి నగరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విడతల వారీగా ఈ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 11, 12 తేదీలలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ ఒప్పందం చేసుకోనున్నారు.
అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తాయని ఇప్పటివరకు ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.15వేల కోట్ల రుణంపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నిధుల వినియోగం ఏ విధంగా ఉంటుంది, నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనే దానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ కలిపి రూ.15వేల కోట్లు రుణంగా ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక సాయం పొందడానికి సీఆర్డీయేకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.