

మనన్యూస్:ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని యాజమాన్యం 45 రోజుల క్రితం అర్ధాంతరంగా మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిన నేపథ్యంలో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో అనేక విధాల ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో సోమవారం సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని గేటు ముందు బైఠాయించి తహసిల్దార్ ఆర్ వి వెంకటేశ్వరరావు తో సహా సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎన్ రామలింగేశ్వరరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అధికారులకు దారి ఇవ్వాలని కార్మికులతో వాగ్వివాదానికి దిగారు.అయినా కార్మికులు కాతర్ చేయకపోవడంతో రొంగల ఈశ్వరరావు తో సహా పలువురు కార్మికులను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు తహసిల్దార్ వెంకటేశ్వరరావు జోనల్ కార్మిక శాఖ అధికారి దృష్టికి సమస్యను ఫోను ద్వారా తీసుకొచ్చారు.జే ఎల్ ఓ ఈ నెల 6 వ తేదీన ఫ్యాక్టరీ యాజమాన్యానికి కార్మికులకు మధ్య చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో కార్మికులు కొంత శాంతించి ఆరో తేదీన సమావేశం జరిపి తమకు న్యాయం చేయకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఆందోళనకు అంగన్వాడీ కార్యకర్తల సంఘం సెక్టార్ అధ్యక్షులు కాకరపల్లి సునీత మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు,కార్మిక నాయకులు ఏ వీరబాబు కె చక్రధర్ గోవింద్ ధర్మాజీ లోవరాజు అన్నపూర్ణ వరలక్ష్మి సత్య చంటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళ కార్మికులు ఉన్నారు.