యాదమరి, మన ధ్యాస డిసెంబర్-03: గణిత అపార ప్రజ్ఞాశాలి, అద్భుత మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా, ఆయన గణిత ప్రతిభను ప్రతి విద్యార్థి ఆదర్షంగా తీసుకోవాలని సీనియర్ గణిత ఉపాధ్యాయులు కె. కనకాచారి పేర్కొన్నారు. పుట్టుకతోనే అంధుడైన సంజీవరాయ శర్మ చిన్నతనంలో అక్క చదివే 1–20 ఎక్కములు వింటూ గణితంపై ఆసక్తి పెంపొందించుకున్నారు. అక్క బడికి వెళ్లిన తరువాత స్వయంగా 22, 36 ఎక్కములు నేర్చుకొని అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్లకపోయినా, గణితాన్ని సాధనతో స్వయంగా అందిపుచ్చుకున్నారు. ఏ సంఖ్యనైనా ఇంకో సంఖ్యతో గుణించమంటే కేవలం కొన్ని సెకన్లలోనే సమాధానం చెప్పే ప్రతిభ సంజీవరాయ శర్మకు ఉండేది. ఉదాహరణకు 36,72,416 × 66,78412 వంటి మహా సంఖ్యల గుణాకార ఫలితాన్ని కూడా క్షణాల్లో చెప్పగలిగేవారు. ఈ అసాధారణ ప్రతిభతో ఆయన శ్రీకాళహస్తిలో పిడేలు విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వర్గాలు, ఘనాలు, పెద్ద సంఖ్యల లెక్కలు ఏ గణిత సమస్య అయినా శకుంతలాదేవి కంటే ఒక సెకను ముందుగానే చెప్పే మహా ప్రావీణ్యం ఆయన సొంతం. గణితంపై ఆయనకున్న అపార ఏకాగ్రత, పట్టుదల, సాధన ఈ రోజూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఉపాధ్యాయులు కనకాచారి, భాస్కర్ రెడ్డి, రంగనాధం గుర్తుచేశారు. ఈ సందర్భంగా తరగతిలో విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలను వివరించి, “పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే… సంజీవరాయ శర్మ దానికి ప్రత్యక్ష ఉదాహరణ” అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.








