యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నిర్వహించారు. పాఠశాల చివరి 30 నిమిషాలు ఈ వేడుకకు కేటాయించి, పురుష ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వారికి బట్టలు, బహుమతులు, స్వీట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్.యం. లలిత మాట్లాడుతూ, “అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రత్యేకత ఏమిటి, చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో లోకజ్ఞానం పెంపొందించడంతో పాటు పెద్దల పట్ల గౌరవభావం, తోటి వారిపట్ల మర్యాద, క్రమశిక్షణను అలవర్చేలా చేస్తాయి” అని పేర్కొన్నారు. ఇన్చార్జి భాస్కర రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు కనకాచారి మాట్లాడుతూ, “అటువంటి వినూత్న కార్యక్రమాలు ఉపాధ్యాయులు – విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలపరుస్తాయి. మంచి విద్యాభ్యాసం సాగడానికి ఇవి దోహదం చేస్తాయి” అని సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది పురుష ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
అలాగే ఉపాధ్యాయులు — భాస్కర రెడ్డి, కనకాచారి, మధుసూధన్, మధన్ మోహన్ రెడ్డి, దామోదర రెడ్డి, సుధాకర్, మహేష్ షణ్మగం, చిన్నదొరై, రాకేష్ రంగనాధం, చిట్టిబాబు, నాగభూషణం, రాజా, శరత్, హేమంత్, ఆషా, కె.భారతి, మంజుల, మంజులత, భారతి, రాజేశ్వరి, రమాదేవి, కుమారి హిమబిందు, అరుణ, అక్తర్, శర్మిల, హేమాకుమార్ తదితరులు పాల్గొన్నారు.








