మన ద్యాస, సాలూరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చెయ్యటం అన్యాయమని, దీన్ని యావత్తు రాష్ట్రం వ్యతిరేకిస్తోందని కావున ఈ పీపీపీ విధానానికి స్వస్తి చెప్పాలని తోణాం సర్పంచ్ మువ్వల ఆదయ్య డిమాండ్ చేసారు. ఆదివారం ఉదయం మండలంలోని తోణాం పంచాయితీ మథుర గ్రామం మెట్టవలసలో వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని కూటమి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం సర్పంచ్ తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేసేందుకు నిర్ణయించటం దారుణమన్నారు. మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వంలోని కొంత మంది ప్రజా ప్రతినిధుల బంధువులకు అప్పగించేందుకు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారన్నారు. అంతేకాకుండా వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి మందితో సంతకాలు చేయించి గవర్నర్ కి ఇచ్చేందుకు తమ పార్టీ నాయకులు నిర్ణయించారన్నారు. అందులో భాగంగా తాము సేకరించిన సంతకాలను తమ పార్టీ నేత, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా సమితి సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ద్వారా గవర్నర్ కి అందజేస్తామన్నాను







