మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న కష్టజీవి కర్షకుడికి అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాలు, ఇప్పటివరకు అన్నదాతలను వదలడం లేదు.జిల్లాలో భారీ వర్షాలు కురవడం,చేతికి వచ్చిన పంట నీటి పాలు కావడం అన్నదాతను అప్పుల పాలు చేస్తుంది.ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పండించిన ధాన్యం ,చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు పండిన నాలుగు గింజలు చేతికి అందకుండా వర్షం తాకిడికి కొట్టుకుపోతున్నాయి.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్ముకుని అప్పులు తీర్చుకొని గడ్డకు పడదాం అనుకున్నా, అన్నదాతకు అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి.గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద రోడ్డుపై వేసిన ధాన్యం మధ్యాహ్నం భారీ వర్షం పడడంతో వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యాన్ని తీసుకువచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు.రెండు రోజుల్లో కురుస్తున్న వర్షానికి రైతులు వరి ధాన్యాన్ని ఎండబెట్టడం మళ్లీ వర్షానికి తడిసి ముద్ద అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారి ధాన్యాన్ని తరలించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.







