మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు – హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి నగదు చెక్కులు అందజేసిన మంత్రి నారాయణ
మన ధ్యాస, నెల్లూరు ,అక్టోబర్ 23: అక్టోబర్ 2 న గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైనదని .రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని రోడ్లు భవనాలు అతిథి గృహములో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి నారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ఐదు లక్షల రూపాయల చెక్కును, కుమార్తెలు లహన్వి శ్రీ, తన్వి శ్రీలకు 5 లక్షల రూపాయలు వంతున, తిరుమలశెట్టి భార్గవ నాయుడుకి మూడు లక్షలు, తిరుమలశెట్టి పవన్ కుమార్ కు 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ……రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విషయం తెలిసిన వెంటనే లక్ష్మీ నాయుడు హత్య ఉదంతంపై తక్షణమే స్పందించి హోం శాఖ మంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, శాసనసభ్యులు శ్రీనివాసరావులతో కమిటీ వేయడం జరిగిందన్నారు. కమిటీ తుది నివేదిక ప్రకారం లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునే చర్యలలో నిన్న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా నగదుతో పాటు వారి కుటుంబ సభ్యులకు రెండు ఎకరాలు వంతున మొత్తం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అంతేకాక పిల్లల చదువులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు. హత్యాకాండలో వెన్నుపూసకు దెబ్బ తగిలి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న తిరుమల శెట్టి పవన్ కుమార్ కు ఐదు లక్షల రూపాయలు, నాలుగు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గాయలతో బాధపడుతున్న తిరుమలశెట్టి భార్గవ నాయుడుకు మూడు లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. హత్య కేసుపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసి వీలైనంత త్వరగా నేరస్తులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి లక్ష్మీ నాయుడు, హరిశ్చంద్రప్రసాదులు స్నేహితులని కొన్ని లావాదేవీలలో వచ్చిన తేడాల వల్ల హత్య చేయడం జరిగిందని తెలిసిందన్నారు. పిల్లలకు చెల్లించిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…. అక్టోబర్ రెండో తారీఖున జరిగిన హత్యా ఘటన ఒక విషాద గాదాని, ఇద్దరు స్నేహితులు మధ్య వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో హత్య జరిగిందన్నారు. జరిగిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునే విధంగా కమిటీ వేయడం జరిగిందని కమిటీ నివేదిక మేరకు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.బాధితురాలు సుజాత* మాట్లాడుతూ….. ఇది కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగిందని రాజకీయ అంశాలు ఏమీ లేవని ఆమె తెలిపారు. హత్య జరిగిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం .శేఖర్ తదితరులు పాల్గొన్నారు.










