నెల్లూరు నుండి టెలి కాన్ఫరెన్స్ లో అధికారులకు సూచనలు చేసిన మంత్రి – లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశాలు
మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 23:ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలఫై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గురువారం మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొని మంత్రికి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు. వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు నైనా ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మాట్లాడుతూ….. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్ , పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలియజేశారు. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ లను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.










