
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్థానిక నర్సీపట్నం రోడ్డు 17వ వార్డులో నివాసముంటున్న బోదిరెడ్డి వెంకటేశ్వర్లును హత్య చేసినట్లు రాజా రమేష్ పోలీసుల సమక్షంలో అంగీకరించాడు.ఈ మేరకు పోలీసులు వల్లూరి రాజా రమేష్ పై కేసు పెట్టి మంగళవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే మృతుడు బోదిరెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖల సమావేశంలో వెంకటేశ్వర్లు మరణం పట్ల కుటుంబ సభ్యులు రోధిస్తూ పలు సందేహాలు వ్యక్తం చేశారు.వెంకటేశ్వర్లను చంపిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.మృతున భార్య
బోదిరెడ్డి సత్యవతి నా భర్త వృద్ధుడైనప్పటికీ బలవంతుడని,రాజా రమేష్ ఒక్కడే చంపి ఉండడని, అతనితో కలిసి మరి కొంతమంది చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త సౌమ్యుడని, ఎప్పుడు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని కన్నీటిపర్యంతం అయ్యారు. నా భర్త పై ఆధారపడి బ్రతుకుతున్నాం, పెద్ద దిక్కును కోల్పోయామన్నారు.
మృతుడు వెంకటేశ్వర్లు కుమారుడు బోదిరెడ్డి ఆంజనేయులు, కుమార్తె కరణం వెంకటలక్ష్మి లు మాట్లాడుతూ మా కుటుంబాలను నాన్నే చూసేవారిని, తాతయ్య లేక మనవళ్లు బెంగ పెట్టుకున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు సేద్యానికి ముందుగా పెట్టుబడి పెట్టి, వారికి పంటలు చేతికి అందిన తర్వాత రైతుల తిరిగి చెల్లించేవారన్నారు. అపరాల వ్యాపారంతో పాటు గిరిజన ప్రాంతాల్లో రేకుల ఇల్లు నిర్మించే పని చేసేవారు అన్నారు. ఈ వ్యవహారంలోనే వల్లూరి రాజా రమేష్, వెంకటేశ్వర్లు మధ్య స్నేహం పెరిగిందని గత రెండు మూడు సంవత్సరాలుగా దుశ్ఛర్తి, కొత్తూరు, వీరంపాలెం తదితర ప్రాంతాల్లో రేకుల ఇల్లు నిర్మించారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్న వెంకటేశ్వర్లు ను రాజా రమేష్ హత్య చేయాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించారు? అక్టోబర్ రెండో తేదీన రాజా రమేష్ ఫోన్ చేసి మా నాన్నను కారులో తీసుకువెళ్లాడన్నారు. ఆ సమయంలో తన దగ్గర కొంత సొమ్ము ఉన్నప్పటికీ, రైతులకు ఇవ్వాలని ఇంట్లో నుండి 50 వేల రూపాయల సొమ్ము పట్టుకెళ్లారన్నారు. ఆ సమయంలో వెంకటేశ్వర్లు ఒంటిపై ఆరు కాసుల బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారన్నారు. వాటి కోసమే రాజా రమేష్ ఒక్కడే మా నాన్నను చంపాడు అనడం అనుమానాలకు తావిస్తుందన్నారు. వెంకటేశ్వర్లు హత్యలో ఏదో కుట్ర కోణం దాగి ఉంటుందని, పోలీసులు ఈ విషయమై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి హత్యా కుట్ర దారులను పట్టుకోవాలని, చట్టరీత్యా కఠినంగా శిక్షించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మీడియా ముఖంగా అన్నారు.









