- ప్రభుత్వ వైద్యులు శెట్టిబత్తుల శ్రీరామ రాజీవ్ కుమార్
శంఖవరం / అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ఆరోగ్య వంతమైన కుటుంబాలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సుసాధ్యం అవుతుందని శంఖవరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు శెట్టిబత్తుల శ్రీరామ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని అన్నవరం సచివాలయం 2 లో గురువారం వైద్యులు శ్రీరామ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలోని వైద్య బృందం, వివిధ శాఖల ప్రభుత్వ అధికార్ల బృందం, కూటమి పార్టీల నేతలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం మహిళలకు సంపూర్ణంగా వైద్య పరీక్షలను నిర్వహించి వారికి అవసరమైన వైద్య సహాయం మందులను ఉచితంగా అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే అన్నారు. రక్త ప్రసరణ, మధుమేహం, రక్తం హీనత వంటి రోగాలతో పాటు రొమ్ము , ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, నోటి, చర్మ, మూత్రాశయ మూత్రపిండ కణాలు, గర్భాశయం వంటి శరీర భాగాలకు సోకే కేన్సర్ లక్షణాలను బట్టి వాటికి సంబంధించిన అన్ని రకాల ప్రాధమిక పరీక్షలనూ ఈ వైద్య శిబిరంలోనే నిర్వహించి పూర్తి నిర్ధారణకు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రికి సిఫారసు చేస్తామన్నారు. ఆపై అక్కడ రోగ నిర్ధారణ జరిగాక ప్రైవేటు కార్పొరేట్ సంస్థల వివిధ ఆస్పత్రుల్లో పూర్తిగా ఉచిత వైద్య సేవలను అందించే సౌకర్యాన్ని ప్రభుత్వమే కల్పిస్తుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు. అందువల్ల మహిళలు, బాలికలు అందరూ విధిగా ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అందుకు పురుషులు కూడా తమ సంపూర్ణ మద్దతును అందించి సహకరించాలని శంఖవరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు శెట్టిబత్తుల శ్రీరామ రాజీవ్ కుమార్ పిలుపును ఇచ్చారు. అనంతరం వివిధ వైద్య విభాగాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య పరీక్షలను నిర్వహించారు. శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మాసం – గర్భిణీ స్త్రీల పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా గర్భిణీలకు అవగాహనకు స్థానిక అంగన్వాడీ కార్యకర్తల బృందం పౌష్ఠికాహార ముడి పదార్థాల ప్రదర్శనను నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి వారికి సూపర్ వైజర్ బి.వెంకట రజని పర్యవేక్షణలో తగు సలహాలు సూచనలను అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వాడ్రేవు చక్రవర్తి, మాజీ వైఎస్ ఎంపీపీ. బొమ్మడి సత్యనారాయణ సచివాలయం – 2 ఎం ఎల్ హెచ్ పి ఎం ఎం కె కుమారి, ఏఎన్ఎం సుభద్ర, తదితరులు పాల్గొన్నారు..







