

మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు 4 వేల ఎకరాలలో పత్తి పండిస్తున్నారని ఇదంతా కేవలం వర్షాధారంగా మాత్రమే పండిస్తున్నారని అందువలన దిగుబడులు చాలా తక్కువగా వస్తున్నాయని రైతులు కొద్దిపాటి జాగ్రత్తలతో ఒకటి నుంచి రెండు క్వింటాళ్లు దిగుబడి అధికంగా సాధించవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు పేర్కొన్నారు.బుధవారం నాడు తురాయిపాడు గిరిజన గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షధార పత్తి వలన పత్తి పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి అంతర పంటలుగా అపరాలు లేదా చిరుధాన్యాలు వేసుకోవాలని కోరారు.పత్తి చుట్టూ ఒక వరుసలో ఆముదం, రెండు వరుసలలో మొక్కజొన్న మధ్యలో అక్కడ నేలచిక్కుడు వేసుకోవడం ద్వారా కలుపు ఎక్కువగా మొలవకుండా ఉండడమే కాకుండా భూమిలో ఉన్న తేమ శాతాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చన్నారు.దీనివలన అదనపు ఆదాయంతో పాటుగా పత్తి నాణ్యత మరియు దిగుబడి పెరుగుతాయని తెలిపారు.అంతేకాకుండా అంతర పంటలు బహుళ పంటల విధానంలో మిత్ర పురుగుల సంఖ్య పెరిగి పురుగు మందుల పిచికారి ఆవశ్యకత తగ్గుతుందని అలాగే ఎరపంటలు కంచి పంటలు వేయడం ద్వారా పురుగు ఉనికిని కనిపెట్టవచ్చని తెలిపారు. మొక్కజొన్నలో గడ్డి మందు పిచికారి కంటే రెండుసార్లు గొప్పు తవ్వటం ఎంతో ఉత్తమమని కలుపు మందులు నేల స్వభావాన్ని దెబ్బతీయటమే కాకుండా ఏరలను మరియు ఇతర మిత్ర పురుగులను చంపేస్తాయని కాబట్టి అంతర కృషి ద్వారా వేరు వ్యవస్థ దగ్గర గాలి బాగా సోకడం వలన నాణ్యమైన అధిక మొక్కజొన్న దిగుబడులు సాధ్యమని తెలిపారు. అనంతరం టార్పలిన్లు ఆయిల్ ఇంజన్లు పవర్ విడర్లు కావాలని రైతుల కోరారు భూతాల లక్ష్మి మాజీ ఎంపీటీసీ ఎరగడ గంగయ్య గ్రామ వ్యవసాయ సహాయకులు రాకేష్ మరియు లక్ష్మణ్ పాల్గొన్నారు.