

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను పునరుద్ధరించాలని కోరుతూ కొన్నేళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద మల్లాపురం వెళ్లే రహదారి అత్యంత అధ్వానంగా మారడంతో బస్సు సర్వీసును నిలిపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇటీవల శంఖవరం నుండి పెద మల్లాపురం వరకు కొత్త రోడ్డు నిర్మించారు, దీంతో బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతూ ఈ ఏడాది జులై లో స్థానిక జనసేన నాయకుడు, డి ఆర్ యు సి సి సభ్యులు గొర్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల ప్రజలు కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందించగా, వెంటనే స్పందించిన ఎంపీ ఉదయ్ అప్పటికప్పుడు జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బస్సు సర్వీసు ను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో నేటి నుండి కాకినాడ నుండి కత్తిపూడి మీదుగా వేళంగి వరకు రోజుకు రెండు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరితగతిన స్పందించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు గిరిజన గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.