

కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ముగిశాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఈరోజు సాయంత్రం ధ్వజావరోహణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్‌కు వడాయత్తు ఉత్సవం కూడా నిర్వహించగా, భక్తులు ఘనంగా పాల్గొని స్వామివారి కృపాభిషేకాలను పొందారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ ఉత్సవం భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్, ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, ఉభయదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేదపండితులు వేదపారాయణాలు చేశారు.