

గూడూరు, మన ధ్యాస :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఎంపిక చేసిన అర్హులైన 78 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. వీరిలో తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులు కూడా ఉన్నారు. 58 మంది విద్యార్థులకు సంవత్సరానికి రూ.25,000 చొప్పున, 20 మంది విద్యార్థులకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున , మొత్తం రూ.16,50,000 విలువైన ఉపకార వేతనాలను వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ – “మానవ సేవే మాధవ సేవ” అన్న భావంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌరీ శంకర్ గారిని అభినందించారు. ప్రతి గ్రామంలో దేవాలయం, గ్రంథాలయం, విద్యాలయంతో పాటు సేవాలయం కూడా ఉండాలని సూచించారు. సంస్కృతి, సాంప్రదాయాలను మరవకుండా యువతను సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులు, సమాజం మీద ఉందన్నారు. జీవం ఉన్న ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించడానికి హక్కు కలిగి ఉందని, వృక్షాలను, జంతువులను కాపాడడం మనందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సులూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ – “గౌరీ శంకర్ గారు చేస్తున్న సేవలు యువతకు ఆదర్శంగా నిలవాలి” అన్నారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు.
స్వర్ణభారత ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ మాట్లాడుతూ – గౌరీ శంకర్ ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువత స్వయం ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగినేని కృష్ణయ్య, శ్యామ్ బన్సల్, చంద్రశేఖర్ రెడ్డి, బోస్ రాజు, చాగణం వరలక్ష్మి, శ్రీ విన్య, కావ్య, శ్రావ్యతో పాటు గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

