


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామం వరద బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామ ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి నీట మునిగిన ఇండ్లలోని ప్రజలను ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి పరిస్థితి మరింత విషమంగా మారింది. అధికారులు స్వయంగా ట్రాక్టర్‌లో గ్రామానికి వెళ్లి ప్రతి ఇల్లు పరిశీలించారు.నీటిలో ఇళ్లు మునిగిన కుటుంబాలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. వారికి భోజనం, త్రాగునీరు, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరూ ఇబ్బందులు పడకూడదని అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ నగర్ తహశీల్దార్ సవాయి సింగ్, డిప్యూటీ తహశీల్దార్ క్రాంతి కుమార్, ఆర్ఐ పండరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గ్రామానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.వరద ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ మళ్లీ నీటిమునిగిన ఇళ్లలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
