

మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్ కమిషనర్ టి.టి రత్నకుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్ద బజారులో ఉన్న చిరు వ్యాపారస్తులను కలిసి వారితో చర్చించారు. వ్యాపారస్తులెవరైనా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే అపరాధ రుసుముతో పాటు చట్టరీత్యా తగు చర్యలకు బాధ్యులవుతారని సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పెద్ద బజారుకు వెళ్లి అక్కడున్న చిరు వ్యాపారస్తులను హెచ్చరించారు. గుడ్డ సంచులను మాత్రమే వినియోగించాలని అన్నారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్న వ్యర్థాలను రోడ్లమీద గాని, కాలువలో గాని వేయకుండా మున్సిపల్ కార్మికులు తోపుడు బండ్లతో మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి అందజేయాలని పలు వీధుల్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
