

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, విశాఖపట్నంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ ప్రాంగణంలో శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సన్మాన సభలో, సొసైటీ కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, సేవా కార్యక్రమాలలో ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పలువురిని “నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్” జాతీయ అధ్యక్షులు న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విచ్చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శంకవరం మండలం వజ్రకూటం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మండల తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ సేవలను గుర్తించి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది. గ్రామీణాభివృద్ధి, యువత శక్తిని సమాజానికి ఉపయోగపడే విధంగా మలచేందుకు ఆయన చేస్తున్న కృషి, ప్రజల సమస్యలపై తనదైన శైలిలో స్పందించి పరిష్కార మార్గాలు చూపే తీరును ఈ అవార్డు ద్వారా గుర్తించారనడంలో సందేహం లేదు. కీర్తి సుభాష్ గత కొంతకాలంగా మండల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, విద్యార్థులకు ఉచితంగా శిక్షణా శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఆరోగ్య శిబిరాల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రముఖులు, విద్యావేత్తలు, సమాజ హితైషులు, ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు పాల్గొన్నారు. అవార్డు అందుకుంటూ స్పందించిన కీర్తి సుభాష్ “ఇది నాకు ఒక గుర్తింపు మాత్రమే కాదు, మరింత బాధ్యతను గుర్తుచేసే ఘనత. ప్రజలకు నేను చేసిన చిన్న సేవలను గుర్తించి ఇచ్చిన ఈ అవార్డును ప్రజలకే అంకితం చేస్తున్నాను. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పని చేస్తాను,” అని పేర్కొన్నారు.