

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34 కోట్ల వ్యయంతో చేపట్టిన 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయని, పనుల్లో వేగం పెంచాలని ఆమె సూచించారు. మైల్డ్ స్టోన్ ప్రకారం నిర్మాణ పనులు త్వరగా జరగాలని ఆదేశించారు. ఆస్పత్రి భవన నిర్మాణ నమూనా ప్లాన్ ను ఆమె పరిశీలించారు. అనంతరం కృష్ణా మండల కేంద్రంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.156 లక్షల నిధులతో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను సైతం కలెక్టర్ పరిశీలించారు. ప్లాస్టరింగ్ దశలో ఉన్న పి హెచ్ సీ భవనం లోపల కొనసాగుతున్న మెడికల్ ఆఫీసర్ గది, స్టాఫ్ రూమ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గదులను చూశారు. నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రశ్నించగా మరో మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని వారు తెలిపారు. పిహెచ్ సీ చుట్టూ ప్రహరీ నిర్మాణం ప్రతిపాదనల్లో ఉందా లేదా? అడిగి తెలుసుకున్నారు. జింకల పార్కు ఏర్పాటు కోసం మూడ్ మల్ శివారులో ప్రభుత్వ స్థలాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారా ?లేదా ? అని రెవెన్యూ అధికారులను అడిగిన కలెక్టర్ వెంటనే అప్పగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, టీజీఎంఎస్ఐడీసీ ఈ ఈ వేణుగోపాల్, డీ.ఈ. కృష్ణ మూర్తి, ఏ.ఈ. సాయి మురారి, మక్తల్, కృష్ణా తహసిలార్లు సతీష్ కుమార్, శ్రీనివాస్, ఎంపీడీఓ రమేష్ కుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.