

వింజమూరు,(మననన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఉపాధి హామీ శ్రామికులకు రెండు పూటల హాజరు తప్పనిసరిగా ఉండాలని డ్వామా పిడి గంగాభవాని తెలిపారు. గురువారం వింజమూరు పంచాయతీ పరిధిలో మోట చింతలపాలెం చెరువు నందు జరుగుతున్న ఫిష్ పాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి శ్రామికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికులు తప్పనిసరిగా రెండు పూటలా పనులకు వెళ్లి తమ హాజరు వేయించుకోవాలని అలా లేనియెడల ఆరోజు పని చేసినప్పటికీ కూలీ నమోదు కాదని తెలిపారు. త్వరలో ఫిష్ యాప్ వస్తుందని, దాని ప్రకారం ఉదయం సాయంత్రం రెండు పూటలా ఫోటోలు తీయించాలని వాటిని అప్లోడ్ చేసినట్లయితే ఆరోజు కూలి నమోదు అవుతుందన్నారు. ఉదయాన్నే 6 గంటలకు పనిలోకి వెళ్లి ఫోటో తీయించుకున్న తర్వాత తిరిగి 11గంటలకు ఫోటో తీంచుకోవాలని ఆ రెండు ఫోటోలు అప్లోడ్ కావడానికి రెండు పూటలా పనులు చేయాలని తెలిపారు. అదే విధంగా క్షేత్ర సహాయకులు సూచించిన పని కొలతలను చేసి 307 రూపాయలు కూలీని పొందాలన్నారు. సమయపాలన పాటించి పనులు చేసుకోవాలని తెలిపారు. ఉద్దేశించిన కొలతల ప్రకారం రెండు పూటల పనులు చేసి నిర్దేశించిన వేతనాన్ని పొందాలని ఆమె తెలిపారు. కావున ఉపాధి శ్రామికులు ఉపాధి హామీ అధికారులు సూచించిన సూచనల మేరకు పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ కృష్ణారావు, టిఏ మురళి, క్షేత్ర సహాయకులు శ్రీనివాసులు, ఉపాధి హామీ శ్రామికులు ఉన్నారు.