

చంద్రగిరి, Mana News :- చంద్రగిరి పకృతి వనరులకు పుట్టినిల్లు. అలాగే తలకోన, కళ్యాణి డ్యాం, శ్రీవారిమెట్టు, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, రాయలచెరువు, శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి చారిత్రాత్మక కోట వంటి పర్యాటక ప్రాంతాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి పర్యటనలో ఉన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేశవిదేశాల నుంచి లక్షల మంది భక్తులు తిరుమలలో వెలసిన ఉన్న శ్రీ వైకుంఠ నాథుని దివ్యదర్శనం కోసం వస్తుంటారు. తిరుపతికి ఆనుకుని ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో సరైన వసతులు లేక పర్యాటక ప్రాంతాల సందర్శన చేసుకోలేక భక్తులు వెనుదిరుగుతున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం దర్శించుకుని అక్కడి నుంచి రాయలచెరువు సందర్శించుకునే వెసులుబాటు కల్పించాలి. అక్కడి నుంచి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కోట, తలకోన, కళ్యాణి డ్యాం, శ్రీవారిమెట్టు, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేయవచ్చు. మొత్తం టూర్ కు సంబంధించి ప్యాకేజీతో ట్రావెల్ ట్రిప్ లు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తలకోన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా దోహదపడుతుంది. రాయలచెరువు, కళ్యాణి డ్యాం లలో బోటింగ్ ఏర్పాటుతో కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయని దేవర మనోహర్ పేర్కొన్నారు. పై అంశాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పై అంశాలను పరిగణనలోకి తీసుకుని పర్యాటక అభివృద్ధికి సహకరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
