

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్): వర్షాకాలం రాగానే వివిధ రకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్ రావుతో పాటు ఆరోగ్య కార్యకర్తలు ఫర్జానా, సునీతలు పాల్గొన్నారు.పలు కాలనీల్లో ఇంటింటి పర్యటన నిర్వహించిన వారు, నీరు నిల్వ ఉండే స్థానాలు, డ్రమ్ములు,పైపులు వంటి వాటిని పరిశీలించారు. దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,నీటి నిల్వ ప్రాంతాలను కప్పివేయాలని, ఇంటి చుట్టుపక్కల శుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు.పైప్లైన్ లీకేజీలు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఫర్జానా, సునీతలు.. ప్రతి ఇంటిలో నీటి డబ్బాలను పరిశీలిస్తూ, దోమల ఉత్పత్తి కేంద్రాలపై వివరాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమ్ రావు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నివారణ చర్యల్లో భాగస్వాములు కావాలి అని అన్నారు.
ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి వారం జరగుతున్న ఈ “ఫ్రైడే ఫ్రైడే” కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందనను పొందుతోందని అధికారులు తెలిపారు.