

మన న్యూస్ ఐరాల జులై-18
పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఐరాల మండలం, వైఎస్.గేటు, కామినాయనిపల్లె, కామినాయనిపల్లె దళితవాడ, కుల్లంపల్లె, కస్తూరినాయనిపల్లె రత్నగిరి, చిన్నవెంకటంపల్లె దళితవాడ, మట్టపల్లె, చింతగుంపలపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పాల్గొన్నారు. అంతకుముందు వైయస్ గేట్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కి ఐరాల మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలు, దుశ్శాలువతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ.. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరిస్తూ మరికొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపుతున్నదనే విషయానికి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమమే నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని చేర్చే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కో-ఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, నాయకులు మేదర్లమిట్ట మోహన్ నాయుడు, దేవాజీ, చంద్రశేఖర్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు , మహిళలు, ప్రజలు పాల్గోన్నారు.