
చెంచుగుడి, మన న్యూస్:- “అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!” అంటూ భక్తుల కేకలతో చెంచుగుడి గ్రామం మార్మోగింది. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన అర్జున తపస్సు ఉత్సవం గ్రామస్తుల హృదయాలను కట్టిపడేసింది.ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు గోవింద నామస్మరణల నడుమ ఉత్సవమూర్తిని ఊరేగింపుగా అర్జున తపస్సు మానువద్దకు తీసుకువచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అర్జున వేషధారి భక్తుడు ప్రత్యేకంగా పూజల అనంతరం తపస్సుమానుపైకి ఎక్కి, పాటలు పాడుతూ నిమ్మకాయలు విసరడం ప్రారంభించాడు. ఆ దృశ్యం చూసి భక్తులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నిమ్మకాయలు పట్టుకునేందుకు కొంగుజాచి ఎదురుచూసిన మహిళలు, యువత అంతా కలసి ఒక పవిత్ర మహోత్సవం లా తిలకించారు. వళ్లు గుగురు పొడిచే పద్యాలు పాటలతో భక్తులను అర్జున వేషధారి తమ పద్యాలతో పాటలతో పరవశింపజేశారు. ఈ సందర్భాన్ని తిలకించేందుకు వచ్చిన వందలాది మంది భక్తులు అర్జున తపస్సు మహిమను అనుభవిస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ధర్మం, భక్తి, ఆనందం ఒకే వేదికపై మిళితమైన ఈ అద్భుత దృశ్యాలు చెంచుగుడి గ్రామాన్ని మరోసారి ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తిన ఉదాహరణగా నిలిపాయి. శ్రీ కృష్ణా ద్రౌపతి సమేత ధర్మరాజుల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న 64వ మహాభారత మహోత్సవం భాగంగా, ఈరోజు (11-06-2025, బుధవారం) చెంచుగుడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో అర్జున తపస్సు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.