

మన న్యూస్, కడప /కావలి :ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుజాతికి పండగ రోజు అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి మాట్లాడుతూ……. యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అని తెలియజేశారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చినా, మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లినా, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచినా, కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చినా … ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే… ‘‘నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలి’’ అనే సంకల్పమే. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు… చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నదంటే అది ఆయన ఆశీర్వాదబలమే. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నామని సమసమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నాం ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం ప్రత్యేకంగా తెలుగు సినీచరిత్రలో ఎవరెస్టుగా ఎన్టీఆర్ ఎదిగారన్నారు. నీతి నిజాయతీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలని ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు 33 ఏళ్లు వెండితెరకు, 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా.. రైతులకు నేస్తం.. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. అధికారం అంటే బాధ్యత పదవి అంటే సేవ అని నిరూపించారని అనితరసాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందమూరి తారకరామారావు కిఘన నివాళి అర్పిస్తున్నానని ఎమ్మెల్యే దగుమాటి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.



