

గొల్లప్రోలు మే 27 మన న్యూస్ :– డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో ఒకవైపు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతుంటే మరోవైపు అక్రమ వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 వ నంబరు జాతీయ రహదారిని అడ్డాగా చేసుకొని కొంతమంది అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గొల్లప్రోలు మండలం చెందుర్తి,వన్నెపూడి శివారు జాతీయ రహదారిని ఆనుకొని గత కొంతకాలంగా అక్రమ ఐరన్, ఆయిల్ దుకాణాలు ఏర్పాటు చేసి వాహనాల నుండి డ్రైవర్ల సహకారంతో ఆయిల్, ఐరన్ చోరీ చేస్తున్నా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. చెందుర్తి సమీపంలో 1 ఐరన్,3 ఆయిల్ దుకాణాలు, వన్నెపూడి జంక్షన్ సమీపంలో 1 ఆయిల్ దుకాణం ఏర్పాటు చేసి బహిరంగంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారాలను అధికారులు ప్రోత్సహించినా, అక్రమార్కులకు సహకరించినా సహించేది లేదని ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ అధికారులను హెచ్చరించినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు మండల పరిధిలో జాతీయ రహదారిపై గతంలో ఎన్నడూ అక్రమ ఐరన్, ఆయిల్ దుకాణాలు లేవని ప్రస్తుతం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్రమ వ్యాపారాలు రోజురోజుకు విస్తరిస్తుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వ్యాపారులు సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్ట చెబుతుండడంతో అక్రమ దుకాణాలను ఆదాయ వనరులుగా భావించి కొంతమంది అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చెందుర్తి, వన్నెపూడి జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన అక్రమ ఆయిల్, ఐరన్ దుకాణాలను నిరోధించాలని, అక్రమార్కులకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
