

సర్పంచ్ ఇజ్జాడకు పలువురు కృతజ్ఞతలు
Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికి పెంట గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ అప్పలనాయుడు తో కలిసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించారు. గత కొన్నేళ్లుగా ఆ గ్రామానికి త్రాగునీటి సమస్య నెలకొంది.సుమారు 280 కుటుంబాలు వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న గ్రామానికి తరచూ తాగు నీటి సమస్య సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడుకు తలనొప్పిగా మారింది. మండల సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రభుత్వ అధికారులు సహకారంతో పంచాయతీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 3000 లీటర్లు కెపాసిటీ కలిగిన మంచి నీటి పథకాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇంకా సమస్య కళ్ళ ఎదుట కనబడుతుండటంతో ప్రతీ వీధిలో కుళాయిలు మాదిరిగా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో గత కొద్ది కాలంగా సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది తో కలిసి వీధి వీధికి మంచినీటి పథకాలు నిర్మించారు. అనంతరం వీధి వీధికి రెండేసి పైపు లైన్లు కుళాయిలు మాదిరిగా ఏర్పాటు చేసి త్రాగు నీరు అందించారు. కొటికి పెంట పంచాయితీలో గల 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి త్రాగునీటి పథకం ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ అప్పలనాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజల సమస్యలను తీర్చడం పట్లపలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు ఆ గ్రామంలో కుళాయిల ద్వారా నీరు సరఫరా ప్రారంభించారు. గతంలో ఆ గ్రామ ప్రజలు కలుషితమైన నీరు తాగి ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇకపై ఆ ఆరోగ్య ఇబ్బందులు ఉండవని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
