

మన న్యూస్, కోవూరు, మే 20:- జాతరలా మినీ మహానాడు – లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- పదవులు శాశ్వతం కాదు.. ప్రజా సంక్షేమంలో రాజీ పడం- ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం- కోవూరు నియోజవకవర్గంలో 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు- క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ- సీఎం చంద్రబాబు అనుభవమే రాష్ట్రాన్ని కాపాడుతోంది – ఎంపీ వేమిరెడ్డిపసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం కోవూరులోని కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న నేతలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి సభాధ్యక్షత వహించి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదింపజేశారు. ఈ సందర్బంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్‌రెడ్డి గ మాట్లాడుతూ.. అత్యంత క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని, ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. కేంద్రంలో సీఎంకు ఉన్న పరపతితో రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కుతోందన్నారు. ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం సీఎంకే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు తన వద్దకు వస్తామన్న తానే వారి కార్యాలయాలకు వెళ్లి రాష్ట సమస్యల గురించి చర్చించడం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు విజన్ చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతారని చెప్పారు. దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధులు కూడా మంజూరు అవుతున్నాయన్నారు. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖభవ పథకాలు అమలు చేయనున్నారని చెప్పారు. నెల్లూరు నుంచి కడప మహానాడుకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో కోవూరు నియోజకవర్గంలో డబల్ ఇంజన్ పరిపాలన కొనసాగుతుందన్నారు. గతంలో ఎంపీ శాసనసభ నియోజకవర్గాలలో పర్యటించిన దాఖలాలు అరుదని, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచాక ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారని గుర్తు చేశారు. అమృత ధార తాగునీటి ప్లాంట్లు, దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తూ ప్రజాసేవకు కొత్త భాష్యం చెప్తున్నారని అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిస్వార్థ ప్రజా సేవకులని, ఆయన చొరవతో దగదర్తి విమానాశ్రయంతో పాటు జిల్లాలో భారీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఎంపి వేమిరెడ్డి సామాజిక బాధ్యత వున్న నిస్వార్ధ ప్రజా ప్రతినిధి అని కొనియాడారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిదని, ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరించారు. ‘కొత్త పాత కలయికతో ప్రయాణం చేసేటప్పుడు పార్టీలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వైసీపీలో ఉన్న అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పార్టీ కోసం ఎలా కష్టపడ్డారు, ఏ పార్టీ నుంచి వచ్చారని కాదు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయడమే లక్ష్యం కావాలి. పార్టీని గౌరవించాలి, పార్టీ సిద్ధాంతాలు పట్ల నిబద్ధతగా పని చేయాలి, గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చిత్తశుద్ధితో కృషి చేయాలి అని వివరించారు. కేవలం ప్రజాసేవ చేయడం కోసమే తాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. అవినీతిరహిత, వివాదరహిత కోవురే నా లక్ష్యం. ఎక్కడ ఒక రూపాయి ఆశించకుండా స్వచ్ఛంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. పార్టీలకతీతంగా ప్రజా సేవ చేస్తున్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే అది ప్రతిపక్షమా స్వపక్షం అని చూడం. మాకు తెలిసిందల్లా ప్రజలకు మంచి చేయడమే. ఏ కార్యకర్తను ఏ నాయకుడిని నేను విస్మరించను. మీ సేవలను గుర్తిస్తాను. కోవూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అండగా ఉంటాం. నాతో కలిసి నడిచిన ఏ నాయకుడికి అన్యాయం జరగదు. పదవులు శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరికి దశలవారీగా పదవుల్లో అవకాశం కల్పిస్తాను. ఇసుక దోచుకోవటం గ్రావెల్ తోలుకుంటామంటే కుదరదు అక్రమాలకు నేను సహకరించను అని కుండ బద్దలు కొట్టారు. పదవులు పొందాలని చాలామందికి ఆశ ఉంటుంది, ఉండేది ఐదు పదవులు అందరికీ న్యాయం చేయలేను. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు గతంలో మండల అధ్యక్షులుగా పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత కొత్త నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిల నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం పరిశ్రమల హబ్ గా మారబోతుంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో త్వరలో ఐటీ, ఇతర పరిశ్రమలు రానున్నాయి. వేమిరెడ్డి దంపతులకు అండగా ఉండి కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిద్దామని పిలుపునిచ్చారు. చెముకుల చైతన్య మాట్లాడుతూ.. టిడిపి ఆవిర్భావముతోనే బీసీలకు రాజ్యాధికారం దక్కింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని కోవూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకున్న కార్యకర్తలు చేసుకున్న పండగలా మినీ మహానాడు ఉందని అన్నారు. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుచ్చి ఛైర్ పర్సన్ సుప్రజ మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతులు మాటలు చెప్పే నాయకులు కాదని, పనులు చేసి చూపించే నాయకులన్నారు. వేమిరెడ్డి దంపతుల సహకారంతో బుచ్చి పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కోడూరు కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిజంగానే దైవాంశ సంభూతుడని, ఆయన పట్ల భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఆయన పార్టీ మారినా ఇబ్బందులు రాలేదన్నారు. అందుకే అనేక దైవ కార్యక్రమాలు చేస్తూనే ప్రజాసేవకు తానున్నానని భరోసా ఇస్తారన్నారు. కార్యక్రమంలో పెల్లకూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, జివిఎన్ శేఖర్‌రెడ్డి, యర్రంరెడ్డి గోవర్థన్‌రెడ్డి, జెట్టి గోపాల్‌రెడ్డి, మండలాల పార్టీ నూతన అధ్యక్షులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





