

ManaNews:- (పార్వతీపురం మన్యం), నవంబర్ 19 : సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ వినూత్నంగా ఆలోచించారు. జిల్లాలో గల పాలిటెక్నిక్, ఐ టి ఐ సంస్థల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు. తన ఆలోచనను బయట పెట్టారు. విద్యార్థులకు వృత్తి అనుభవ పూర్వక విద్య లభిస్తుందని, తద్వారా సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలు బాగు పడతాయని అభిప్రాయ పడ్డారు. అందులో భాగంగా చేపట్టవలసిన పనులు వివరించారు. పాలిటెక్నిక్, ఐ టి ఐ లలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ప్లంబింగ్, సివిల్ తదితర విభాగాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలలో మరమ్మతులకు గురైన ఫ్యాన్ లు, ఫర్నిచర్ తదితర పరికరాలను బాగు చేయగలరని చెప్పారు.

పల్లె నిద్ర* , గ్రామ దర్శిని కార్యక్రమంలో అధికారులు పాల్గొని, ఆయా విద్యా సంస్థల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించడం జరిగింది. ఈ మేరకు మన్యం జిల్లాలో గల ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఆయా మండలాలలో గల హాస్టల్స్, స్కూల్స్, జూనియర్ కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ సంస్థల ను సందర్శించి అక్కడ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ,వెల్డింగ్ ,ఫర్నిచర్ కు సంబంధించి మరమ్మతులు ఉంటే ఆర్థికేతర పనులలో భాగంగా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రతి రెండు మండలాలకు ఒక ఐటిఐ కళాశాల , ఒక పాలిటెక్నికల్ కళాశాలతో అనుసంధానం చేయడం జరిగింది. అధికారుల ఆదేశాలు ప్రకారం గత వారం రోజుల నుండి విద్యార్థిని విద్యార్థులు ఆయా మండలాలలో గల ప్రభుత్వ సంస్థలను సందర్శించి అక్కడ గుర్తించిన మరమ్మతులు చేయడం జరుగుచున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థినికి విద్యార్థులకు 10 నెలల తర్వాత “అప్రెంటిషిప్” సర్టిఫికేట్ కలెక్టర్ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని వసతి గృహ సంక్షేమ అధికారులు, విద్యా సంస్థల ప్రిన్సిపాల్ కు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమం కు నోడల్ ఆఫీసర్ గా జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాధికారిని శ్రీమతి డి మంజుల వీణను నియమించడం జరిగింది.ఈ మేరకు సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, అగ్నిమాపక శాఖ కేంద్రంలో విద్యార్థులు గేట్ లను, ఫ్యాన్ లను మరమ్మతులు చేయడం, వాటికి పెయింటింగ్ చేయడం జరిగిందని మంజుల వీణ తెలిపారు. మిగిలిన ప్రదేశాల్లో పలు పనులు చేపట్టడం జరుగుతోందని ఆమె చెప్పారు.
