

- ఆర్ధిక సంఘంలో అన్నవరం సర్పంచ్ కుమార్ రాజా ప్రాతినిధ్యం
- తిరుపతిలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతో సమావేశం..
శంఖవరం/ తిరుపతి మన న్యూస్ (అపురూప్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి లో గురువారం నిర్వహించిన 16 వ ఆర్ధిక సంఘం సమావేశంలో కాకినాడ జిల్లా నుంచి అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు పాల్గొన్న ప్రజాప్రతినిధుల బృందానికి కుమార్ రాజా నాయకుడిగా వ్యవహరించారు. ఆర్ధిక సంఘం కార్యకలాపాలపై సంపూర్ణ అవగాహన ఉన్న కుమార్ రాజా తన అభిప్రాయాలు, సూచనలను ఆర్ధిక సంఘం ముందు ఉంచారు. కమీషన్ సభ్యుడు డా. సౌమ్య కాంతి ఘోష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి, నిధుల వినియోగం, పారదర్శక పాలనపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కుమార్ రాజా మాట్లాడుతూ, “గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే. ఫైనాన్స్ కమీషన్ నిధులు గ్రామ స్థాయిలో పారదర్శకంగా వినియోగించాలి. ప్రణాళికాబద్ధంగా, ప్రజల ఆకాంక్షల ప్రకారం పనులు జరిగేలా చూడాలని అన్నారు. ఆయన సుదీర్ఘ అనుభవం, ప్రజలతో నిత్యసంబంధం, క్రియాశీలక అభివృద్ధి కార్యక్రమాలు కమిషన్ సభ్యుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ సమావేశం ద్వారా పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీలకు మరింత ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపును పునఃపరిశీ లించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో కుమార్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, ఆయన ప్రాతినిధ్యం కాకినాడ జిల్లాకు గౌరవాన్ని తీసుకొచ్చిందని పలువురు జిల్లా నేతలు అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజాను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్, పంచాయతీ రాజ్ అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ వీరాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.