

మన న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య 50 వసంతాల ముగింపు సభల కరపత్రాలను మండల కేంద్రం గొల్లప్రోలు, జగనన్న కాలనీలో ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ…
భూమి, భుక్తి ఈ దేశ విముక్తి కోసం సాగిన పోరాటాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన కలలతో ప్రజలను చైతన్య పరుస్తూ కీలక భూమిక పోషించిందని ఆయన తెలిపారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉస్మానియా యూనివర్సిటీలో 1974లో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ సారథ్యంలో పురుడు పోసుకొని 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2024 డిసెంబర్లో హైదరాబాదులో పెద్ద ఎత్తున సభలను నిర్వహించడం జరిగిందని,దాన్ని కొనసాగింపు ఈనెల 12వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముగింపు సభ జరుపుకుంటుందని,ఈ సభను ప్రజా కళాకారులు, విప్లవ సానుభూతిపరులు, విద్యార్థి, మేధావులు,కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మధ్యభారత్ అడుగుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఆదివాసుల హత్యలు కార్పొరేట్ కంపెనీలకు అడవుల్లోని ఖనిజ సంపదను దోచిపెట్టడానికే అని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, అలాగే చత్తీస్‌గఢ్ లోని కర్రె గుట్టలను చుట్టుముట్టిన వేలాది మంది సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు,
ఎ ఐ ఎఫ్ టు యు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పి డి ఎస్ యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు డి. నారాయణమూర్తి, గొర్ల శివ, కే .శ్రీధర్ , వేగిశెట్టి గణేష్, తదితరులు పాల్గొన్నారు.