

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 6 :- జోగులాంబ గద్వాల జిల్లా:-ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు తెలియజేశారు. మంగళవారం గద్వాల రూరల్ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఆటోపై ట్రాఫిక్ సంబంధించి జాగ్రత్తలు తెలియజేసే స్టిక్కర్లను అతికించి,మైక్ ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ… ప్రజలకు రక్షణ కల్పించేందుకు ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు క్షేమంగా గమ్యం చేరాలన్నదే పోలీసుల లక్ష్యమని ఆయన తెలియజేశారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు, సెల్ఫోన్ డ్రైవింగ్ అనర్ధదాయకం, వేగం కన్నా ప్రాణం మిన్న, హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేరండి అని ట్రాఫిక్ రూల్స్ వివరించడం జరిగింది. అలాగే ఆపద సమయంలో ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సాయం పొందాలని సూచించారు.లైసెన్స్,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలుపవద్దని, రోడ్డు పక్కనే ప్రయాణికులను దింపాలని సూచించారు.రోడ్డుప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించాలని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు పలు సూచనలు చేశారు.మద్యం సేవించి వాహనం నడపరాదని, తక్కువ దూరం ఉన్న రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని తెలిపారు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేయాలన్నారు.అతివేగం ప్రమాదకరమని జాగ్రత్తగా వాహనాలు నడపలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు.ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు..లైసెన్సును రద్దు చేస్తామన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ..తాము క్షేమంగా ఉండడంతో పాటు ఎదుటివారు కూడా క్షేమంగా ఉండే విధంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.