

శంఖవరం మన న్యూస్ (అపురూప్):
కాకినాడ జిల్లా శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డిపిఎం) జె.ఎలియాజర్ ఆధ్వర్యంలో రింగ్స్ లో పెరటి తోట ను పెంచే విధానంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలో రింగులు ఏర్పాటు చేసుకొని ఇసుక, ఘనజీవామృతం, కోకో పిట్, బయోచార్, మట్టి ని ఉపయోగించి శాశ్వత పెరటి తోట ను తయారు చేసుకునే విధానంపై రైతులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన పోషకాలు గల ఆహారం లభిస్తుందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే రింగ్స్ లో పెరటి తోటలు వేసుకుని నాణ్యమైన పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు పొందవచ్చునని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినడం వలన రోగాల బారిన పడకుండా మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చునని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేకూరుతుందని అన్నారు. ఎన్ ఎఫ్ ఏ నాయుడు మాట్లాడుతూ ప్రతి మానవునికి ముఖ్యంగా కావలసింది ఆరోగ్యం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలను తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. మాస్టర్ ట్రైనర్ (యమ్ టి) దాడి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రజలందరూ ప్రకృతి వ్యవసాయం ద్వారా కావలసిన ఆకుకూరలు, కూరగాయలను పెరటి తోటల ద్వారా ఇంటి వద్దనే పండించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మనతో పాటు మన పిల్లలు, తర్వాత తరాల వారు కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. జిల్లా కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా సంవత్సరం అంతా ఇంటి వద్దనే ఏ విధంగా పండించుకోవాలనేది రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ ఛార్జ్ లు పివివి సత్యనారాయణ, మణికంఠ, సతీష్, డిఎంఎంటి లు మద్దూరి సత్తిబాబు, అప్పన్నబాబు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.