

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం టక్కోలు రైతు సేవా కేంద్రం నందు నూనె గింజల అభివృధి పథకం మరియు జాతీయ ఆహార భద్రత మిషన్ చిరు ధాన్యాలు,పప్పు దినుసులు, నూనె గింజలు పంటల సాగు సాంకేతిక పద్ధతులు, విలువ జోడింపు, కోత అనంతర యాజమాన్యం తదితర అంశాలపై బద్వేల్ వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగరాజ మరియు ఊటుకూరు ,కడప ఏరువాక కేంద్రం సమన్వయ కర్త డా. కే అంకయ్య కుమార్ రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సిద్ధవటం మండల వ్యవసాయ అధికారి కె.రమేష్ రెడ్డి,రైతు శిక్షణా కేంద్రం కడప వ్యవసాయ అధికారి యు. నాగభూషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఎ వాల్యూయేటర్ ఆకుల వంశీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, RAWEP విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ పథకాల కింద 50 శాతం సబ్సిడీపై వివిధ రకాల పురుగు, తెగుళ్ల మందులు అవసరమైన రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. నూనె గింజల పంటల సాగు విత్తనము మొదలు పంటకోత వరకు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు వివరించారు.
విత్తన శుద్ది, సకాలములో సస్యరక్షణ చర్యలను కూడా వివరించారు. సుస్థిర భూసారం, పంట దిగుబడి కొరకు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను, 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద 50 శాతం సబ్సిడీపై వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తున్నామని అవసరమైన రైతులు వినియోగించు కోవచ్చు అని సూచించడం జరిగింది. ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పని సరిగా పొందాలి. ప్రతి రైతు సమస్య పరిష్కారం కొరకు రైతు సేవా కేంద్రం ఒక వేదిక అని, క్రమం తప్పకుండా సందర్శిస్తూ రైతు సేవలు పొందాలని తెలిపారు. రసం పీల్చు పురుగులు నివారణకు జిగురు పూసిన పసుపు తెలుపు నీలం రంగు పల్లాలు అమర్చడం చేయాలి అని సూచించడం జరిగింది. అలాగే వేప గింజల కషాయం తయారుచేసి వాడకము కూడా మంచిది. తదుపరి ఆంధ్రప్రదేశ్ సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఎవాల్యూయేటర్ ఆకుల వంశీ ని మరియు ప్రకృతి వ్యవసాయ రైతు నాగేండ్ల అంకిరెడ్డి ని ఘనంగా సన్మానించారు.