

మన న్యూస్, కావలి, ఏప్రిల్ 25 :– కావలి నియోజకవర్గ దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. 27న సమావేశానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి.
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు భరోసానిస్తూ.. వారిలో ఆత్మ విశ్వాసం నింపేలా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న బృహత్తర కార్యం ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమం కావలి నియోజకవర్గానికి చేరుకుంది. ఈ నెల 27న ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. అందుకు సంబంధించి అన్ని వసతులు కల్పిస్తున్నారు. సభా ఏర్పాట్లు సాగుతుండగా.. ఇప్పటికే సభా ప్రాంగణానికి ట్రై సైకిళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా కావలి నియోజకవర్గస్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.ఏ రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. తన పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో ఇప్పటికే కోవూరు, ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించగా… ప్రస్తుతం ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సహకారంతో కావలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించే కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమ జరుగుతుండగా.. ఇప్పటికే ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు అందించారు. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో దాదాపు 160 మంది దివ్యాంగులకు గుర్తించి వారికి ట్రై సైకిళ్లు అందించనున్నారు. ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో దాదాపు 650 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించారు.కావలి నియోజకవర్గానికి సంబంధించి ట్రై సైకిళ్ల పంపిణీ, ఆత్మీయ సమావేశం ఈ నెల 27న ఆదివారం ఉదయం 10:00 గంటలకు కావలి పట్టణంలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్న గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నారు. సమావేశానికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా.. షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రై సైకిళ్లు పంపిణీకి, ఆత్మీయ సమావేశానికి వేర్వేరుగా వేదికలు నిర్మిస్తుండగా… సమావేశాలకు వచ్చేవారి కోసం ప్రత్యేకంగా భోజన వసతి కల్పిస్తున్నారు. ట్రై సైకిళ్ల లబ్ధిదారులకు ఉదయం టిఫిన్ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
