

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 22:– 100 రోజుల పాటు సాగే వయోజన విద్యాకేంద్రాలతో 100 శాతం అక్షరాస్యత సాధిద్దాం. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో స్థానిక నాయకులు భాగస్వాములు కావలి.వయోజన విద్యా కేంద్రాల నిర్వహణకు విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుంది.నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. -ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటి మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కలెక్టర్ తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ……..ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారాల కారణంగానే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టామన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు గుర్తించి వారికి విద్యా బోధన చేయడంలో మొబిలైజర్ల పాత్ర కీలకమన్నారు. మొబిలైజర్ల సేవకు గుర్తింపుగా స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రశంశా పత్రాలు అందచేస్తామన్నారు. అలాగే వయోజన విద్యా కేంద్రాలలో విద్యనభ్యసించిన ప్రతిభావంతులైన వారికి ఉపాధి పనులలో మస్టర్స్ వేయడం లాంటి శారీరిక శ్రమ లేని విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత అనేది అభివృద్ధికి సూచిక లాంటిదన్నారు. కోవూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు పై బడ్డ వారిలో దాదాపు 22 వేల మంది నిరక్షరాస్యులు వున్నారన్న విషయం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 100 రోజుల పాటు నిర్వహించే ఈ వయోజన విద్యా బోధన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా 200 మంది మొబిలైజర్లతో పాటు 2,500 విద్యా వాలింటీర్లు భాగస్వాములు అవుతున్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు చొరవ రీసుకొని నిరక్షరాస్యులైన వయోజనులకు విద్య యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన అవసరం వుందన్నారు . చదువుకుంటే సామాజిక విషయాల పై అవగాహన పెరిగి ప్రభత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టు ప్రతి మహిళ విద్యనభ్యసించేందుకు కొంచెం సమయం కేటాయించిలని కోరారు. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా తలపెట్టిన వయోజన విద్యా విద్యా కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఏ అవసరమొచ్చినా సహాయం చేసేందుకు విపిఆర్ ఫౌండేషన్ సిద్ధంగా వుందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సబ్సిడీ పై రైతులకు పురుగు మందులు పిచికారి చేసే స్ప్రేయర్లు ఇతర వ్యవసాయ పనిముట్లు అందచేసారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య జిల్లా డిప్యూటి డైరక్టర్ అహమద్ ఆజాద్, ICDS PD సువర్ణ కుమారి, డ్వామా పిడి గంగాభవాని, జిల్లా విద్యా శాఖాధికారి బాలాజీ రావు, జెడ్ ఫై సి ఇ ఓ విద్యారమ తో పాటు స్థానిక అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు.
