సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- శానంపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు ఏడవ పౌష్టికార వారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీమతి జయమణి అధ్యక్షతన, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కె. రిజ్వాన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయమణి మాట్లాడుతూ, గర్భస్థ దశ నుండి రెండు సంవత్సరాల వయస్సు వరకు ఉండే పిల్లల కోసం మొదటి 1000 రోజులు చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ సమయంలో సరైన పోషణ, వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పౌష్టికార కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వివరించారు. లబ్ధిదారులు తమ పేరును పోషణ ట్రాకర్‌లో స్వయంగా నమోదు చేసుకునే విధానం పై అవగాహన కల్పించారు. సూపర్వైజర్ రిజ్వానా మాట్లాడుతూ, ఈ పౌష్టికార వారోత్సవం ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భవతుల్లో రక్తహీనత నివారణ కోసం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించబడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శ్యామ్ మేడం మాట్లాడుతూ, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ఎన్.ఆర్.సీ సెంటర్లకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు సుమతి, ఉపాధ్యాయులు రాధా మాధవి, మైరిహార్ కార్యదర్శి సాంబశివరావు, నయోమి, ఆరోగ్య పర్యవేక్షకులు సయ్యద్ మసూద్ అలీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.










