

Mana News, న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.ఇప్పటికే స్పీకర్ తరపున స్పీకర్ కార్యదర్శి కౌంటర్‌ను దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను అఫిడవిట్‌లో ఖండించారు. స్పీకర్ చట్టపరమైన విధులను అనుసరిస్తున్నారని, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే న్యాయపరమైన పరిష్కారం సాధ్యమని, అంతవరకు కోర్టులు స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేరంటూ స్పష్టంగా తన కౌంటర్‌లో దాఖలు చేశారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని, స్పీకర్ వద్ద పిటిషన్‌లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్‌ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని, స్పీకర్‌పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని క్లాజ్ 6 కింద స్పీకర్‌కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధకారాలు ఉన్నాయన్నారు.అంతేకాకుండా అసెంబ్లీ సమావేశమై పదిహేను నెలలు కూడా కాలేదు, అసెంబ్లీ పదవీకాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణల్లో కూడా పసలేదని, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతున్న పిటిషనర్లకు నోటీసులు ఇచ్చామని, వారి ఇచ్చే సమాధానాలు విన్నాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, స్పీకర్ విశేషమైన అధికారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో కూడా 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో కూడా స్పీకర్‌కే నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా కౌంటర్‌లో గుర్తుచేశారు. మరోవైపు ఈ కేసులో పిటిషనర్ల తరుపు వాదనలు విన్న సుప్రీం కోర్టు… గతంలో ఇచ్చిన తీర్పులను కాదని ఎలా చెబుతామని, ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై ధర్మాసనం చెప్పలేదని, వాటికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటామని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఈరోజు సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి.
