

మనన్యూస్,తిరుపతి:అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి చైర్మన్ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం స్థానిక ఎంఎల్ఏ శ్రీ ఆరణి శ్రీనివాసులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామికి సోదరిగా చెబుతారన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా మొదటి విడతగా రూ.3.75 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు రూ.3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ముఖ మండపం, పోటు, తూర్పు, ఉత్తరం,
పశ్చిమ వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించి రాబోవు టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మే 6 నుండి 13వ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు చైర్మన్ శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాష్ రెడ్డి, శ్రీ ఎం. శాంతారాం, సీఈ శ్రీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
