మన న్యూస్, నారాయణ పేట జిల్లా ప్రతినిధి:- నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నారాయణ పేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్,కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని కోస్గి పట్టణ కేంద్రంలో వైర్లెస్ సీసీ కెమెరాలను శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ ఎండి. ప్రదీప్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షల రూపాయలతో 18 అధునాతన వైర్లెస్ సీసీ కెమెరాలను కోస్గి టౌన్, ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్,కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాయకులు ఎనుముల తిరుపతిరెడ్డి కలిసి కోస్గి పోలీస్ స్టేషన్లో వైర్లెస్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను ఎస్పీ గారు కోరారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన తెలుస్తుందని, ఎక్కడ ఎలాంటి అలజడి జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సిసి కెమెరాలకు జిపిఎస్ కనెక్ట్ చేయడం వల్ల కోస్గి నుండి జిల్లా కమాండ్ కంట్రోల్ కు మరియు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నేరాలు నియంత్రించవచ్చని తద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని, సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు ఎనుముల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ,ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో నేరాల అదుపు చేయడానికి పోలీసులతోపాటు ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను, వ్యాపారస్తులను భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు వ్యాపారస్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పోలీసుల సహకారంతో కోస్గి మద్దూర్ లో కాకుండా కొడంగల్ నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరముంటుందని తెలిపారు. జిల్లాలో నేరాలు నిర్మూలించడానికి, ఎలాంటి అల్లర్లు జరగిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను అరెస్టు చేయడం జరుగుతుందని కోస్గి నుండి కాకుండా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుండి వీక్షించడం జరుగుతుంది అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కోస్గి పట్టణంలో అధునాతన వైర్లెస్ సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన శ్రీ సాయి కన్స్ట్రక్షన్ ఎండి ప్రదీప్ రెడ్డి ని అభినందించి వారి అనుచరుడు విశ్వనాథ్ రెడ్డిని ఎస్పీ, తిరుపతి రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు,వీరిని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఈ కార్యక్రమంలో కాడ చైర్మన్ వెంకట రెడ్డి గారు, డీఎస్పీ ఎన్ లింగయ్య, కోస్గి సిఐ ఏ సైదులు, గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, కోస్గి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి, శ్రీ సాయి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ విశ్వనాథ్ రెడ్డి, మద్దూర్ ఎస్సై విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.