లోక్ సభ లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్
సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ
మనన్యూస్,కాకినాడ:అన్నవరం నుండి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. సోమవారం లోక్ సభలో రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ పై జరిగిన చర్చలో భాగంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 947 కి. మీ సుదీర తీర ప్రాంతం, భారీ ఎగుమతులతో ప్రధాన పోర్టులు ఉన్నప్పటికీ రైల్వే కారిడార్ లేకపోవడం వల్ల వాణిజ్యం, లాజిస్టిక్స్ తో పాటు ప్రాంతీయ పోర్టుల అనుసంధానం లో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు, దీన్ని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడ రేవులను అనుసంధానం చేస్తూ త్వరితగతిన కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తే సరుకు రవాణా సులభతరం అవ్వడంతో పాటు వ్యవసాయరంగం, సీ ఫుడ్స్ ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కేవలం 30 కి. మీ కొత్త రైల్వే ట్రాక్, తక్కువ పెట్టుబడితో కోస్టల్ కారిడార్ పూర్తయ్యే అవకాశం ఉందని తద్వారా కాకినాడ వాసుల చిరకాల వాంఛ అయిన రైల్వే మెయిల్ లైన్ డిమాండ్ కూడా నెరవేరుతుందని, అలాగే కారిడార్ పూర్తయితే బొగ్గుపై ఆధారపడడం తగ్గడంతో పాటు, రైల్వే సరుకు రవాణా సులభతరం అవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి,వికసిత్ భారత్ 2047 ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రైల్వే శాఖ చొరవ తీసుకొని కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ పై త్వరితగతిన అధ్యయనం చేయాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృషితో కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్, రైల్వే బడ్జెట్లో ఏపీకి అత్యధికంగా 9, 417 కోట్లు కేటాయింపులు చేయడం పట్ల ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.