Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు. అప్పట్లో టీడీపీని ప్రత్యర్థి పార్టీలు ఓడించాయన్న వాదనతో ఆయన ఏకీభవించలేదు. ఈ ఓటమికి తానే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాజకీయ జీవితంలో తనను ఎవరూ ఓడించలేదని, గతంలో టీడీపీ ఎదుర్కొన్న పరాజయాలకు తానే కారణమని వెల్లడించారు. 2004, 2019 ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి తన పద్ధతులు, పనితీరు, ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పని, పని అంటూ తాను పని చేశానని, కానీ, కొన్ని కీలకమైన విషయాల్లో సమన్వయం లోపించడమే ఓటమికి కారణమైందన్నారు. అయితే తన విధానాలపైనే పూర్తి నమ్మకం ఉందని, ప్రజల కోసం నిరంతరం పని చేయడంలో ఎలాంటి రాజీపడనని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. రాజకీయంగా ఎదురైన ఓటములు తాను చేసిన పనులను కించపరిచేలా కాకుండా మరింత ముందుకు సాగేలా మార్పులే తెచ్చాయని సీఎం విశ్లేషించారు. ఎప్పటికీ ప్రజలతోనే ఉండాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కానీ, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడితే ఓటమికి ఆస్కారం ఉండదని చెప్పుకొచ్చారు.