Mana News :- పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కూటమేతర పార్టీలన్నీ కూడా పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇస్తోన్నాయి. తెలుగుదేశం క్యాడర్‌ను సైతం తీవ్ర అసహనానికి గురి చేసిందా స్పీచ్. పవన్ కల్యాణ్ ప్రసంగంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడారు. ఘాటు విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ఆయన వ్యాప్తి చేస్తోన్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు. తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి ప్రశ్నించారు. బీజేపీ మైకం నుంచి బయటపడాలంటూ హితవు పలికారు. పార్టీని స్థాపించిన ఉద్దేశాన్ని కూడా పవన్ కల్యాణ్ విస్మరించి ప్రవర్తిస్తోన్నారంటూ చురకలు అంటించారు. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు పవన్ కల్యాణ్ ఎప్పుడో నిళ్లొదిలేశారని, ఇప్పుడాయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అడుగుజాడలను ఆదర్శంగా తీసుకున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారంటూ మండిపడ్డారు. జనసేన పార్టీని ఆంధ్ర మతసేన పార్టీగా మార్చారంటూ విమర్శించారు వైఎస్ షర్మిల. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి దాన్ని ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం అంటూ ధ్వజమెత్తారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రలో విభజించు.. పాలించు అన్నట్లుగా ఆయన వైఖరి ఉండటం విచారకరమని పేర్కొన్నారు.పార్టీ పెట్టి 11 సంవత్సరాల పాటు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తరువాత కూడా మతం రంగు పూసుకోవడం ఎంత మాత్రం సరైంది కాదని షర్మిల పేర్కొన్నారు. ఒకరికి ప్రయోజనాలను కల్పించడమే తన ఉద్దేశం అన్నట్లుగా పవన్ మాట్లాడటాన్ని ఖండిస్తోన్నామని షర్మిల చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పవన్ మేల్కొనాల్సిన అవసరం ఉందని, బీజేపీ మైకం నుంచి బయట పడాలని హితవు పలికారు.