Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయడం వలన పరిపాలన పనులకు ఆటంకం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఈనెల 13న సర్క్యులర్ తీసుకురాగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్క్యులర్ ప్రకారం యూనివర్సిటీ రూల్స్ అతిక్రమించడం, ధర్నాలు ఆందోళనలు చేయడం, నినాదాలు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది తమ అధికారిక విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటివి చేయవద్దని అందులో పేర్కొన్నారు. వర్సిటీ సిబ్బంది అధికారులపై అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం వంటివి కూడా నిషేధించారు. వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు.