మనన్యూస్,కాకినాడ:ఈ నెల 14న శుక్రవారం జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జయకేతనం అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు.ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కాకినాడలోని జనసేన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వెల్లడించారు. పిఠాపురంలోని చిత్రాడ గ్రామం వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న జయకేతనం సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలిరానున్నారని ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరిగే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని మనోహర్ తెలిపారు.
ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టామన్నారు. తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టామని తెలిపారు. ఆయన విద్యాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎనలేని కృషి చేశారని వివరించారు. రెండవ ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేసిన దొక్కా సీతమ్మ పేరు పెట్టామని వెల్లడించారు. ఇక మూడవ ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెడతామన్నారు. ఈ ముగ్గురు మహానుభావులు ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు జనసేనకు అఖండ విజయాన్ని అందించారని మనోహర్ అన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని ఆయన కొనియాడారు. మార్చి 14న జరిగే ఈ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని మనోహర్ వివరించారు. అనంతరం జయకేతనం పోస్టర్ను ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధ్యక్షుడు తోట సుధీర్, ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), బత్తుల బలరామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన సైనికులు నాయకులు పాల్గొన్నారు